తెలుగు

మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. (మార్కు సువార్త 16:15)

who create the world
Q1. సృష్టికర్త (దేవుడు) ఎవరు?

ఈ అనంత విశ్వంలో నాటి నుండి నేటి వరకు ఈ భూమి మీద ప్రతినిత్యం మానవాళిని ప్రశ్నించుచున్న అంశమే నిజమైన దేవుడు ఎవరు? సృష్టికర్త ఎవరు? ఈ అనంత విశ్వంలో దేవుడున్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? అని కొందరు ప్రశ్నించుచున్నారు. "సృష్టించడం" అనేది జరగాలంటే దానికి తప్పకుండా "సృష్టికర్త" కావాలి. ఆ సృష్టికర్త "దేవుడైన యెహొవా" ఆయన ఆత్మ స్వరూపియైన దేవుడు కాబట్టి దేవుడున్నాడని ఆయన సృష్టికర్త అని బైబిల్ గ్రంధమునందు మొట్టమొదట దేవుడు రాయించిన "ఆదికాండము" అనబడిన పుస్తకము నందు మనం చూడగలం. మొదట దినమున దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. దేవుడు వెలుగును, చీకటిని వేరుపరచేను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. రెండవ దినమున దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు పరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలమును వేరు పరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమూ అని పేరు పెట్టెను. మూడవ దినమున దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక! అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరుపెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరుపెట్టెను. నాల్గవ దినమున దేవుడు రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఐదవ దినమున దేవుడు భూమియందేమి, ఆకాశమందేమి, జలములయందేమి జీవము కలిగి చలించు వాటినన్నిటిని కలుగును గాక! అని పలికెను. ఆరవ దినమున దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వాని సృజించెను. స్త్రినిగాను, పురుషునిగాను వారిని సృజించి ఆశీర్వదించెను. ఈ విదంగా సృష్టికర్తయైన దేవుడు (యెహొవా) సృష్టిని సృష్టించెను.

who is jesus
Q2. యేసుక్రీస్తు ఎవరు ?

2000 సంవత్సరముల క్రితం దేవుడు ఏసు ప్రభువుని ఈ లోకానికి పంపెను. పరిశుద్ధ గ్రంధము లోక రక్షకుడైన యేసుక్రీస్తును గురించి క్రి.పూ. 750 సంవత్సరముల క్రితం యోషయ 7:14 లో "కాబట్టి దేవుడు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు (దేవుడు మనకు తోడైయున్నాడు) అను పేరు పెట్టెను" అని వ్రాయబడి యున్నది. వేదాలలోను మరియు ఇతర మతగ్రంథాలలోను మర్మముగ వ్రాయబడిన సంగతులు ఉదాహరణకు "ఈశా పుత్రం చమాం విద్ది కుమారి గర్భం" అని భవిష్య పురాణంలో వ్రాయబడియున్నది. దీని భావమేమనగా దేవుని కుమారుడు కన్యక గర్భమున జన్మించెనని తెలుసుకోనుము. కాబట్టి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములోని యోషయ ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నూతన నిబంధనలోని మత్తయి సువార్త 1:22 నందు ఈ క్రింది విధముగా నెరవేరెను. "ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పేరుపెట్టెదరు" అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మనుయేలు అను పేరునకు భాషాంతరమున "దేవుడు మనకు తోడు అని అర్థం" అప్పుడు యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి "యేసు" అని పేరుపెట్టెను.

why he is coming to the world
Q3. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ?

ప్రతి మానవుడు జన్మతః కర్మతః పాపి, "ఏ భేదము లేదు, అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు" (రోమా 3:23). ఇతర మతగ్రంథాలు కూడ "సర్వ పాప పరిహరార్ధం రక్త ప్రోక్షణ మవశ్యకం! తద్ రక్తం పరమత్మైన, పుణ్యదాన బలియగం!" అనగా సర్వమానవాళి పాప పరిహరార్ధం నిమిత్తం పరిశుద్ద రక్తం చిందించవలెను. ఆ రక్తం పరిశుద్ధుడైన పరమత్ముడిదై ఉండవలెను. కాబట్టి పాపము నుండి మనలను శాశ్వతంగా విడిపించుటకు సృష్టికర్తయైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించెను.

why he died for us
Q4. యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు మరణించారు ?

మానవుని పాపం పరిహరించబడాలి అంటే గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము ద్వారా పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుట వలన పాపం పరిహరించబడదు. ఈయనయితే (యేసుక్రీస్తు) పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి (హెబ్రీ 10:12) అనగా ఆయనే (యేసుక్రీస్తు) సిలువపై తనకు తానే మన కొరకు తన ప్రాణమును అర్పించి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు పాపము నుండి విడుదల అనుగ్రహించెను. ఈ విధంగా యేసుక్రీస్తు మన కొరకు మరణించి మూడవ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచేను.

why should we worship jesus
Q5. యేసుక్రీస్తుని మనం ఎందుకు ఆరాదించాలి ?

మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చినవారై యుండగా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా బ్రతికించెను. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి మన అపరాధముల చేత చచ్చినవారై యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించెను. భూమి మీద మన గుడారమైన యీ నివాసము శిధిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినడియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదము.

how should we worship god
Q6. దేవుని మనం ఏవిదంగా ఆరాధించాలి ?

దేవుని మనం ఆరాధించాలి అంటే ముందుగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని హృదయపూర్వకముగా అంగీకరించి, క్రీస్తు ద్వారానే మనం దేవుని రాజ్యం చేరగలం అని గ్రహించాలి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను ఆయనను ఆరాధించాలి. ఎటువంటి విగ్రహములకు మ్రొక్కకూడదు, ఎందువలన అంటే దేవుడు ఆత్మస్వరూపియై యున్నాడు. అంతే కాకుండా విశ్రాంతి దినమును పవిత్రముగా ఆచరించాలి. అనగా ఆదివారము (పునరుత్తాన దినము) దేవుని సన్నిదిలో ఆరాధన చేయాలి. నీ ప్రాణ, ఆత్మ, శరీరాములను ఆయనకు స్వాధీన పరచుకుని విశ్రాంతి దినమును పవిత్రముగా ఆచరించుట వలన మనం ఆయనను ఆరాధించగలం.

what should we do now
Q7. మనం చేయవలసింది ఏమిటి ?

నీ దేవుడైన యెహొవాను నేనె, నేను తప్ప వేరోక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమాందేగాని, క్రింద భూమియందే గాని, భూమి క్రింద నీళ్ళయందె గాని ఉండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పుజింపకూడదు. ఏలయనగా ని దేవుడైన యెహొవా రోషముగల దేవుడు. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, ప్రతివాని మోకాలును యేసు నామములో వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహీమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, అన్ని నామములకన్నా పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్ధమిదే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. గూడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను ఆది మంచిదే గాని, చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును.